Telangana scheme:సీఎం రేవంత్ దసరా కానుక.. వాళ్లందరికి డబుల్ పండుగ
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి, యూనిక్ నంబర్‌తో కూడిన స్మార్ట్ కార్డులను అందించడం, ఫ్యామిలీ కార్డుల ముఖ్య ఉద్దేశ్యం అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పేద, మధ్య, ధనిక వర్గాల మధ్య తేడా లేకుండా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలనే ఉద్దేశంతో డిజిటల్ ఫ్యామిలీ కార్డులను ప్రవేశపెడుతున్నామని ఆయన వివరించారు.
ఈ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా, కుటుంబ సభ్యుల సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. సచివాలయంలో, చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారితో కలిసి, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడిఏ), ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణలో 119 నియోజకవర్గాలలో 238 ప్రాంతాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు నిర్వహించగా, ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం మరియు ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. పూర్తిగా పట్టణాలు లేదా నగర నియోజకవర్గాల్లో అయితే, రెండు వార్డులు లేదా డివిజన్లను ఎంపిక చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 3 నుండి 7 తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో (డోర్-టూ-డోర్) సమాచారం సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను నియమించనున్నట్టు వెల్లడించారు. అలాగే, మండలానికి ఒక తహశీల్దారును కూడా నియమించాలని తెలిపారు.
కుటుంబ సభ్యుల వివరాల నమోదు మరియు మార్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. హెల్త్ కార్డుల విధానంపై, తెలంగాణ అధికారుల బృందం మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలలో పర్యటించి ముఖ్యమంత్రి గారికి నివేదిక అందించినట్టు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి గారు దీనిపై సూచనలు ఇచ్చారని, వాటిని అనుసరించి ఈ పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు.
ఈ నెల 3వ తేదీ నుండి ముఖ్యమంత్రి ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో వచ్చే ఫలితాలను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
గత నాలుగేళ్లుగా లక్షలాది మంది ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్నారని, ఆలస్యం లేకుండా దరఖాస్తులను పరిష్కరించాలన్న ఆదేశాలు కలెక్టర్లకు ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఉన్నప్పటికీ, కేవలం కొద్ది సంఖ్యలో పరిష్కరించడం పట్ల మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడిఏ)ల పరిధిని విస్తరించడం, కొత్త యూడిఏలను ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రతిపాదనలు త్వరగా పంపాలని ఆదేశించారు.
గత ప్రభుత్వం అలా ప్రకటించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం అప్రతిష్టగా ఉంది, ఇందులో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. పూర్తయిన ఇండ్లను దసరా పండుగకు ముందు లబ్దిదారులకు అందించాలన్న లక్ష్యంతో కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం జిల్లా ఇన్-చార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా మరియు మరికొంతమంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.