Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆదాయం ఎంతలోపు ఉండాలంటే..?
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది, పేదలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేయాలన్న ముఖ్యమంత్రి పట్టుదలతో, అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులు, అర్హులైన వారందరికీ త్వరలోనే రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. దరఖాస్తుల స్వీకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఆదాయ పరిమితి అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ₹1.50 లక్షలు, నగర ప్రాంతాల్లో ₹2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు అర్హులుగా పరిగణించబడతాయి. ఈ ఆదాయ పరిమితిని కొనసాగించాలా, లేక మార్పులు చేయాలా అనే అంశంపై మంత్రి వర్గం ఆలోచనలు చేస్తోంది. సెప్టెంబర్ 21న జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 89.96 లక్షల మంది రేషన్ కార్డులు పొందగా, ఇంకా లక్షలాది కుటుంబాలు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. రేషన్ కార్డులకు అనేక సంక్షేమ పథకాలు అనుసంధానించబడిన కారణంగా, ప్రజల్లో ఈ కార్డులపై మరింత ఆసక్తి పెరిగింది.