మహా లక్ష్మి పథకం..మహిళలకు ప్రతి నెల ఉచితంగా రూ.2500 ఎప్పటినుంచంటే..!?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారిపోయింది అని చెప్పవచ్చు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమలులోకి తీసుకొస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం కుర్చీలో కూర్చోగానే తొలుత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడమే గాక..పేదలను ఆదుకుంటున్న ఆరోగ్య శ్రీ ట్రీట్ మెంట్ లిమిట్ మొత్తం 10 లక్షల వరకు పెంచారు. దీంతో వచ్చి రావడంతోనే సీఎంపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై జనాల్లో పాజిటివిటీ పెరిగింది.
ఆ తర్వాత అభయహస్తం ప్రజాపాలన పేరుతో తెలంగాణలోని ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి పేదల డాటా మొత్తం తీసుకున్నారు. ఈ డాటా ప్రకారంగా..తామిచ్చిన 6 గ్యారెంటీల అమలు దిశగా చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
రీసెంట్ గా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ తో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే, ఈ రెండు బెనిఫిట్స్ మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఇదే విధంగా మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం షురూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకానికి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షలు ఇస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు మహాలక్ష్మి స్కీం అమలుపై ద్రుష్టి పెట్టారు. అయితే, ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ పథకాల అమలుకు బ్రేక్ పడింది.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు పోటా పొటీగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల వద్దకు వెళుతూ పలు సంక్షేమ పథకాలపై హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో కీలక విషయాలు ప్రస్తావించారు.
లోక్ సభఎన్నికలు పూర్తి కాగానే..కొత్త పెన్షన్లు ఇవ్వడం షురూ చేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రస్తుతం ఉన్న పెన్షన్లు 4 వేలకు పెంచుతాం అని కూడా తెలిపారు. అలాగే మహాలక్ష్మి స్కీం కింద అర్హులైన మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఈ మహా లక్ష్మి ఆర్ధిక సాయం అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట.
మహిళలకు అందించబోయే ఈ 2500 రూపాయల ఆర్థిక సాయం విషయంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోందట. ఎలాంటి పెన్షన్స్ తీసుకోనటువంటి కుటుంబాల్లోని మహిళలకు ఈ సాయం అందేలా విధివిధానాలు రెడీ చేస్తున్నట్లు టాక్. ఈ ముఖ్యమైన మహా లక్ష్మి పథకాన్ని ఈ ఏడాది జులై నెల నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.