రైతన్నలకు గుడ్ న్యూస్.. ఇక డబుల్ ఆదాయం..!!
దేశంలోని రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలకను ప్రారంభించాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా వివిధ రకాల హామీలను ఇస్తున్నాయి. అయితే, మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన స్కీం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది అని చెప్పవచ్చు. దీని ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు తమ అకౌంట్లలో జమ అవుతాయి. కాగా, ఇవి మూడు దఫాలకు వారి అకౌంట్లలో పడతాయి. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున వ్యవసాయ పెట్టుబడికి కావాల్సినవి కొనుగోలు చేయడానికి రైతన్నకు అందిస్తున్నాయి. ప్రస్తుతం 16 విడతలుగా ఈ డబ్బులు జమ కాగా.. 17వ విడత డబ్బుల కోసం రైతన్నలు ఎంతగానో కాపుకాస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో అద్భుత పథకం పీఎం కుసుమ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏళ్ల తరబడి ఆదాయం సమకూరుతుంది. దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరంగా ఆదాయం పొందవచ్చు. ఈ పథకం ద్వారా రైతులకు సోలార్ పంపులపై భారీ ఎత్తున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. వీటిని పొలాల్లో అమర్చాల్సి ఉంటుంది. వీటి ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గుతాయి. కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం అస్సలే ఉండదు.
ఈ పథకం ద్వారా అదనపు ఆదాయం కూడా రైతులకు వస్తుంది. సోలార్ పంపుల ద్వారా తయ్యారయే విద్యుత్ ను తమ వ్యవసాయ అవసరాలకు వాడుకొని..మిగిలిన విద్యుత్ ను అమ్ముకునే వీలు ఉంటుంది. ఇలా దాదాపు 25 ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. దీంతో ఎలాంటి కరెంట్ కోత బాధలు ఉండవు.
ప్రధాన మంత్రి కుసుమ్ యోజన పథకంలో రైతులు తమ పంట పొలాల్లో సోలార్ పంపులను అమర్చుకోవడానికి 60 శాతం వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇందులో 30 శాతం కేంద్రం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బ్యాంకు ద్వారా 30 శాతం రుణం తీసుకోగా, మిగిలిన 10 శాతం రైతులకు ఇవ్వాల్సిఉంటుంది. రూ.34,422 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం కాలవ్యవధిని మార్చి 2026 వరకు పొడిగిస్తూ ఇటీవల కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని 2019లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.