ఏపీలో రేషన్ కార్డు దారులకు దసరా కానుక నేటి నుంచే అమలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం శుభవార్త అందించింది. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువవుతున్న నేపథ్యంలో, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు భారం తగ్గించేందుకు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త విధానం ఈ రోజు నుంచే అమలులోకి రానుంది.
పండుగ సీజన్‌లో వంట నూనెల ధరలు అధికంగా ఉండటంతో, ప్రభుత్వం డిస్కౌంట్ ధరలకు వీటిని అందించేందుకు సిద్ధమైంది. రేషన్ షాపుల్లో పామాయిల్ లీటర్ రూ.110కి, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.124కి విక్రయించనున్నారు. రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి మూడు ప్యాకెట్ల పామాయిల్, ఒక ప్యాకెట్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే ఇచ్చేలా నిర్ణయించారు.
Dussehra gift for ration card holders in AP will be implemented from today..!
వంట నూనె ధరలు నియంత్రణకు తీసుకున్న చర్యల్లో భాగంగా డిస్కౌంట్ ధరలకు అమ్మాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరకు ఈ వంటనూనెలను అందించనున్నట్లు చెప్పారు. ఈ తగ్గింపు ధరలు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు.
విజయవాడలోని సివిల్స్ సప్లయిస్ భవన్‌లో వంట నూనె సరఫరాదారులు, డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. అంతర్జాతీయ మార్కెట్, దిగుమతుల సమస్యలు, సోయా ఎంఆర్పి పెరుగుదల, ప్యాకింగ్ చార్జీల పెరుగుదల వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిపి, ఈ నిర్ణయాలు తీసుకున్నారు.