Chandrababu Naidu: ప్రతీ ఇంటికి రూ.25వేలు.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఏపీ రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ప్రభుత్వం అంచనా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ క్రమంలో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
విజయవాడ నగరంలో బుడమేరు ముంచివేయడంతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.
సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు సహా వరదల వల్ల నష్టపోయిన ప్రతీ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మునిగిన ఇళ్లకు రూ. 25,000 సాయం అందిస్తామన్నారు. అలాగే, ఫస్ట్ ఫ్లోర్ వరకూ మునిగిన ఇళ్లకు రూ. 10,000 సాయం అందిస్తామని చెప్పారు. చిరు వ్యాపారులకు రూ. 10,000 సాయం అందిస్తామని వెల్లడించారు.
ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ, చిన్న పరిశ్రమలు) కూడా ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. టర్నోవర్ ఆధారంగా రూ. 1 లక్ష నుండి రూ. 1.5 లక్షల వరకూ సాయం అందిస్తామని తెలిపారు.
బైకుల బీమా, మరమ్మతులపై కూడా దృష్టి పెట్టామని, వేలాదిగా బైకుల క్లెయిమ్‌లు ఉన్నాయని చెప్పారు. బైక్ యజమానులకు రూ. 71 కోట్ల మేర క్లెయిమ్‌లు ఉన్నాయని, రూ. 6 కోట్లు ఇప్పటికే చెల్లించామని, ఇంకా 6 వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
త్రీ వీలర్ యజమానులకు రూ. 10,000 సాయం, టూ వీలర్ యజమానులకు రూ. 3,000 సాయం అందిస్తున్నామని చెప్పారు. ఎడ్లబండ్లు కోల్పోయిన వారికి కొత్త ఎడ్లబండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.
చేనేత కార్మికులకు కూడా సాయం అందిస్తున్నామని, మగ్గం కోల్పోయిన వారికి రూ. 25,000, ఫిషింగ్ బోట్లకు నష్టపోయిన వారికి రూ. 9,000 నుండి రూ. 25,000 వరకూ సాయం అందజేస్తామని చంద్రబాబు వివరించారు.
వ్యవసాయానికి, పశు సంపదకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తుందని, పంటల, పశువుల నష్టానికి సంబంధించి ప్రతి విభాగంలోనూ సాయం ప్రకటించారు.