టెన్త్ పాసైన విద్యార్ధులకు అలెర్ట్..ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ రోజు అనగా మే 8 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖస్తు సమర్పణలకు అవకాశం ఉంటుంది. ఆర్‌జీయూ కేటీ పరిధిలో ఉన్న ఆర్‌కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, ఒంగోలు క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీ, తెలంగాణ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే, ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్ధులు తప్పనిసరిగా 2024 సంవత్సరానికి పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ నేపథ్యంలో ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి చొప్పున 4 క్యాంపస్ లో మొత్తం 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్ధులకు, మిగిలిన 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయిస్తారు. వీటిల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద 400 సీట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.200, ఇతరులకు రూ.300 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ నియమావళి ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు మాత్రం అదనంగా 4 శాతం మార్కులు కలుపుతారు.
అలాగే రెండేళ్ల పీయూసీ చిదివాక విద్యార్థులకు బయటకు వెళ్లేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తారు. మెరిట్ ఆధారంగా కేటగిరీ వైజ్ ప్రాధాన్య క్రమంలో క్యాంపస్‌లు కేటాయించడం జరుగుతుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు ఎంచుకున్న ప్రాధాన్యత వైజ్‌గా క్యాంపస్ కేటాయిస్తారు. ఒకసారి క్యాంపస్ నిర్ధారించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ బదిలీకి అవకాశం ఉండదు. అందువల్ల ప్రవేశం పొందిన క్యాంపస్‌లోనే విద్యార్థులు చదవాల్సి ఉంటుంది.