రేషన్‌కార్డు ఉన్నవారికి శుభవార్తను చెప్పిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌లో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభవార్త అందించారు. ఈ నెల నుంచి రేషన్ లో కేవలం బియ్యం మాత్రమే కాకుండా, కందిపప్పు మరియు పంచదార కూడా సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విధానాన్ని విజయదశమి నుంచి అమలు చేయనున్నారు. కందిపప్పును కిలో రూ.67కి, పంచదారను అరకిలో రూ.17కి అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, రేషన్ సరఫరా ప్రక్రియను మెరుగుపరచేందుకు డీలర్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటింటికి రేషన్ సరుకులు అందించే వాహనాలపై మార్పులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
ధరల పెరుగుదలకు చెక్ పెట్టే విధానాలు:
ప్రస్తుతం రేషన్‌లో బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను పంపిణీ చేస్తున్నామనీ, వచ్చే ఏడాది జనవరి నుంచి తృణధాన్యాలను కూడా చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో రాయితీపై కందిపప్పు, పంచదార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుందని వివరించారు. త్వరలోనే నూనె మరియు గోధుమపిండి వంటి నిత్యావసరాల్ని కూడా రేషన్‌లో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ రాయితీ విధానం:
2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం రాయితీపై కిలో రూ.40కి రెండు కిలోల కందిపప్పు పంపిణీ చేసేది. కానీ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ధరను రూ.67కి పెంచి, ఒక్క కిలో మాత్రమే సరఫరా చేయడం ప్రారంభించారు. సరఫరా ప్రక్రియలో కొన్ని లోపాలు ఉండటంతో ఈ స్కీంను నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి మనోహర్ తెలిపారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నిత్యావసరాల ధరలు పెరగకుండా నియంత్రించేందుకు మళ్లీ కందిపప్పు, పంచదార పంపిణీ ప్రారంభించామని వివరించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 4.3 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని, రేషన్ సరఫరా వాహనాలకు మరింత మద్దతు ఇవ్వడం కోసం త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.